2029 కల్లా అర్హులందరికి ఇళ్లు
కరాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి
అక్షర కిరణం, (అమరావతి): రాష్ట్రంలోని అర్హులైన నిరుపేదలు అందరికీ 2029 కల్లా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించినట్టు రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖా మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. బుధవారం రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణతో కలసి ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో గృహ నిర్మాణ కార్యక్రమాలు, ప్రగతిలో ఉన్న గృహ నిర్మాణాల పురోగతి, భవిష్యత్ ప్రణాళికలు తదితర అంశాలపై సీఎం నారా చంద్రబాబు నాయుడు సమగ్రంగా సమీక్షించి పలు ఆదేశాలను జారీ చేశారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తదుపరి గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 2.81లక్షల గృహాలను పూర్తి చేశారని తెలిపారు. వచ్చే నెల 15 కల్లా 3.00 లక్షల గృహాలను పూర్తి చేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్టు చెప్పారు.
డిసెంబరు కల్లా మరో లక్ష టిడ్కో గృహా నిర్మాణాలు పూర్తి చేస్తామన్నారు. రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ డిసెంబరు కల్లా మరో లక్ష టిడ్కో గృహ నిర్మాణాలను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించినట్లు తెలిపారు. ఇప్పటికే టిడ్కో ప్రాజెక్టు కింద దాదాపు 83,072 ఇళ్లను పూర్తి చేశామని, వీటిలో 2014-19 మధ్య కాలంలోనే దాదాపు 75 వేల ఇళ్లను పూర్తి చేశామన్నారు. మిగిలినవి వచ్చే ఏడాది మార్చి 31 కల్లా పూర్తి చేస్తామన్నారు. గత ప్రభుత్వం టిడ్కో గృహాలను 2.61 లక్షలకు కుదించిందని, వాటిని ముందుగా పూర్తి చేసేవిధంగా చర్యలు తీసుకోంటామని మంత్రి తెలిపారు. ఈటిడ్కో ప్రాజెక్టు పూర్తి చేయడానికి దాదాపు రూ.6,500 కోట్ల మేర నిధులు కావాల్సి ఉందన్నారు.