తిమ్మాపురంలో జీవీఎంసీ కమిషనర్ పర్యటన
అక్షర కిరణం, (విశాఖపట్నం): తిమ్మాపురం ప్రజల కు తాగునీటి సదుపాయం కల్పించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ పి.సంపత్ కుమార్ తెలిపారు. శుక్రవారం ఆయన జీవీఎంసీ 1వ జోన్ 4వ వార్డ్ పరిధిలోని తిమ్మాపురంలో కార్పొరేటర్ దౌలపల్లి ఏడుకొండలరావుతో కలిసి పర్యటించారు. 4వ వార్డు కార్పొరేటర్ కమిషనర్ దృష్టికి పలు సమస్యలను తేగా కమిషనర్ స్పందిస్తూ తిమ్మాపురం ప్రజలకు మౌలిక వసతులు కల్పిస్తామని తెలిపారు. తాగునీటి సమస్య ఉందని అందుకు ఈ.ఎల్.ఎస్.ఆర్ నీటి ట్యాంకును, పలుచోట్ల బోర్లను ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని పర్యవేక్షక ఇంజనీర్ శ్యాంసన్ రాజును ఆదేశించారు. ఈ ప్రాంతంలో విద్యుత్ దీపాలు సరిగా లేనందున విద్యుత్ దీపాలు ఏర్పాటుపై చర్యలు తీసుకుంటున్నామని, ఇక్కడ పలు నివాసాలకు ఆస్తి పన్నులు విధించాలని కార్పొరేటర్ తెలిపారని వాటికి పన్నులు వేసేందుకు పరిశీలిస్తామని తెలిపారు. తిమ్మాపురంలో నిరుపయోగంగా శిధిలావస్థలో ఉన్న పురాతన తుఫాన్ రక్షక భవనాలు నాలుగింటిని పరిశీలించి కార్పోరేటర్ విన్నపం మేరకు తొలగిస్తామన్నారు. తిమ్మాపురం పరిసర ప్రాంతాలలో భూ ఆక్రమణలపై నిఘా ఏర్పాటు చేసి ఆక్రమణలు జరగకుండా చూడాలని ఏసీపీ రామకృష్ణను ఆదేశించారు. కార్యక్రమంలో సహాయక ఇంజనీరు సురేష్, శానిటరీ ఇన్స్పెక్టర్, తదితరులు పాల్గొన్నారు.