విద్యుదాఘాతంతో నలుగురు యువకుల మృతి
సీఎం చంద్రబాబు తీవ్ర సంతాపం
అక్షర కిరణం, (తూర్పుగోదావరి జిల్లా): తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం తాడిపర్రు గ్రామంలో సోమవారం ఫ్లెక్సీలు కడుతుండగా విద్యుదా ఘాతంతో నలుగురు యువకులు మృతి చెందారు. సర్దార్ పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహావిష్క రణ కోసం ప్లెక్సీలు ఏర్పాటు చేసే పనిలో బొల్లా వీర్రాజు (25), కాశగాని కృష్ణ(23), పామర్తి నాగేంద్ర(25), మారిశెట్టి మణికంఠ పెద్దయ్య(29) పలువురు యువకులు నిమగ్నమయ్యారు. ఈనేపథ్యంలో ఈ నలుగురు ప్లెక్సీని కట్టే క్రమంలో పక్కనే గల విద్యుత్ తీగలు తగిలి విద్యుదాఘాతా నికి గురయ్యారు. స్థానికులు వీరిని రక్షించేలోగానే వీరు అక్కడికక్కడే కన్నుమూశారు. అలాగే ఒకరికి తీవ్ర గాయాలు కాగా, తణుకు ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలిస్తున్నారు. గ్రామంలో సర్దార్ పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా ప్లెక్సీలు కడుతూ నలుగురు యువకులు ఒకేసారి మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
వివాదం నుండి విషాదం వరకు..
తాడిపర్రు గ్రామంలో సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ ఆది నుండి వివాదాల మయమైంది. ఇరు వర్గాల మధ్య ఘర్షణలు కూడా తలెత్తాయి. చివరికి మంత్రి కందుల దుర్గేష్, జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, పలువురు అధికారులు, ప్రజా పతినిధుల చొరవతో సమస్య పరిష్కారమైంది. ఎట్టకేలకు సోమవారం విగ్రహావిష్కరణ, అన్న సమారాధనకు ఏర్పాట్లు చేస్తుండగా, దురదృష్టవశాత్తు ఈఘటన జరిగింది.
4 రోజుల కిందట ఇక్కడే ఇద్దరు మృతి..
ఉండ్రాజవరం మండలంలో నాలుగు రోజుల కిందట క్రాకర్స్ తయారీ కేంద్రంపై పిడుగు పడి ఇద్దరు సజీవ దహనమైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలు కాగా, వారు వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. కాగా నాలుగు రోజుల కిందట ఇదే మండలంలో ఇద్దరు, సోమవారం ఫ్లెక్సీలు కడుతూ నలుగురు మృతి చెందారు.
విద్యుత్ షాక్తో తమ పిల్లలు మృత్యువు బారిన పడగా, ఆ తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు అందరినీ కన్నీటి పర్యంతం చేసింది. గ్రామంలో సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ కార్యక్రమం విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో ఇలాంటి విషాదకర ఘటన జరగడంతో తాడిపర్రులో ఎటు చూసినా రోదనలే వినిపిస్తున్నాయి.
సీఎం చంద్రబాబు సంతాపం
తూర్పుగోదావరి జిల్లాలో విద్యుదాఘాతంతో నలుగురు మృతి చెందిన ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
ఉండ్రాజవరం మండలం తాడిపర్రులో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ సందర్భంగా ప్లెక్సీ కడుతూ వీర్రాజు, నాగేంద్ర, మణికంఠ, కృష్ణ అనే నలుగురు మృతి చెందడంపై సీఎం ఆవేదన చెందారు. ఈ ఘటనలో మరో వ్యక్తి తీవ్రంగా గాయపడటం బాధాకరమన్నారు.
క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బాధిత కుటుంబా లను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబాలకు చంద్రబాబు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరపున రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలంటూ సంబంధిత అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు.