జమ్మూ కశ్మీర్ మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కన్నుమూత
అక్షర కిరణం, (జమ్మూ కశ్మీర్/జాతీయం): జమ్మూ కశ్మీర్ మాజీ లెఫ్టినెంట్ గవర్నర్‌గా సత్యపాల్ మాలిక్ కన్నుమూశారు. ఆయన వయస్సు 79 ఏళ్లు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న సత్యపాల్ మాలిక్ ఢల్లీిలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళ వారం తుదిశ్వాస విడిచారు. జమ్మూ కశ్మీర్‌తోపాటు పలు రాష్ట్రాలకు ఆయన గవర్నర్‌గా పని చేశారు. జాట్ సామాజిక వర్గానికి చెందిన సత్యపాల్ మాలిక్ స్వస్థలం ఉత్తర్ ప్రదేశ్‌లోని బాగ్పత్. విద్యార్థి నాయ కుడిగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన.. తొలిసారి 1974లో చౌధరి చరణ్ సింగ్ స్థాపించిన భారతీయ క్రాంతి దళ్ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
అనంతరం రాజ్యసభ సభ్యుడిగా, తర్వాత జనతా దళ్ తరఫున లోక్‌సభ ఎన్నికల్లో అలీగఢ్ నుంచి పోటీచేసి విజయం సాధించారు . అనంతరం కాంగ్రెస్.. అక్కడ నుంచి లోక్‌దళ్ తర్వాత సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. గొప్ప రాజనీతిజ్ఞ్నడిగా గుర్తింపు పొందిన మాలిక్.. తొలిసారి 2017లో బిహార్ గవర్నర్ గా నియమితులయ్యారు. ఒడిశా గవర్నర్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తించారు.
ఆగస్టు 2018లో జమ్మూ కశ్మీర్ గవర్నర్‌గా నియమితు లయ్యారు.. ఏడాది తర్వాత ఆగస్టు 2019లో జమ్మూ కశ్మీర్‌కు కేంద్రం ప్రత్యేక హోదా రద్దు చేసి, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత మాలిక్‌ను గవర్నర్‌గా కొనసాగించారు. అలాగే, పుల్వామా ఉగ్రదాడి జరిగిన సమయంలో కూడా ఆయనే లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఉన్నారు. జమ్మూ కశ్మీర్ తర్వాత గోవా, ఆపై మేఘాలయ రాష్ట్రాలకు గవర్నర్‌గా మాలిక్ సేవలందించారు.
గవర్నర్ పదవీకాలం ముగిసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించి వార్తల్లో నిలిచారు. ముఖ్యంగా 2020-21 మధ్యలో కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాల వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులకు ఆయన బహిరంగంగా మద్దతు ప్రకటించారు. ఈ పరిణామం బీజేపీ, మాలిక్ మధ్య మరింత దూరం పెంచింది. ఆ తర్వాత 2023లో ఓ ఇంటర్వ్యూలో పుల్వామా ఉగ్రదాడి గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఉగ్రదాడికి దారితీసిన పలు లోపాలను ఆయన బయటపెట్టారు. తనను మౌనంగా ఉండాలని కేంద్రం ఆదేశించిందని ఆరోపించారు. దాడికి ముందు సీఆర్పీఎఫ్ సిబ్బందికి విమాన సౌకర్యం కల్పించాలన్న అభ్యర్థనను తిరస్కరించారని, దాంతో వారు రోడ్డు మార్గంలో ప్రయాణించడంతో తీవ్రవాదులకు లక్ష్యంగా మార్చారన్నది ఆయన విమర్శలు.
ఈ ఆరోపణలపై స్పందించిన బీజేపీ.. గతంలో ప్రభుత్వాన్ని ప్రశంసించిన మాలిక్ వీడియో క్లిప్‌లను విడుదల చేసింది. కేంద్రంపై చేసిన విమర్శలు ఆయనను ప్రతిపక్ష శిబిరానికి దగ్గరచేశాయి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ 2023లో మాలిక్‌ను స్వయంగా కలుసుకున్నారు. ఈ సమయంలో తన ఆరోపణలను పునరుద్ఘాటించారు. ఈ ఏడాది మే నెలలో ఆసుపత్రిలో ఉన్న మాలిక్‌ను రాహుల్ గాంధీ పరామర్శించారు.