రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీల ఫిర్యాదు
ఎఫ్ఐఆర్ నమోదు
అక్షర కిరణం, (న్యూఢల్లీి/జాతీయం): పార్లమెంట్ ఆవరణలో అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్ పార్టీ ఎంపీల మధ్య తోపులాట చోటు చేసుకొంది. ఈ నేపథ్యంలో తమపై దాడికి పాల్పడ్డారంటూ లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు అయింది. మరోవైపు పార్లమెంట్ ఆవరణలో జరిగిన ఈఘటనపై రాహుల్ గాంధీ స్పందించారు. పార్లమెంట్ ఆవరణలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. పార్లమెంట్ లోకి వెళ్లేందుకు తాను ప్రయత్నించానని చెప్పారు. అయితే తనను బీజేపీ ఎంపీలు లోపలకి వెళ్లకుండా ఆపారన్నారు. ఆక్రమంలో తనను నెట్టివేశారని పేర్కొన్నారు.
రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రాజ్యాంగం పై ప్రత్యేక చర్చ చేపట్టింది. అందులోభాగంగా రెండు రోజుల పాటు సభలో రాజ్యాంగంపై చర్చ చేపట్టారు. ఆ క్రమంలో రాజ్యసభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్ అనడం నేడు ఫ్యాషన్ అయిపోయింది. అదే దేవుడి పేరును అన్ని సార్లు తలుచు కొంటే.. స్వర్గంలో సద్గతి ప్రాప్తిస్తుందంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో అమిత్షా వ్యాఖ్యలపై విపక్షాలు మండి పడ్డాయి. దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాయి. కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి.
మరోవైపు అమిత్ షా వ్యాఖ్యలపై ప్రధాని మోదీ స్పందిం చారు. ఆక్రమంలో వరుస తన ఎక్స్ వేదికగా ట్విట్లోతో కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ విరుచుకు పడ్డారు. ఇంకో వైపు.. అమిత్షా మంత్రి పదవికి రాజీనామా చేయడంతో పాటు ప్రజలకు క్షమాపణలు చెప్పాలంటూ విపక్షాలు డిమాండ్ చేశాయి. దీంతో గురువారం అంబేద్కర్ విగ్రహం నుంచి పార్లమెంట్ మకర్ ద్వార్ వరకు పాదయాత్ర చేపట్టారు. అనంతరం పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ ఎంపీలు ఆందోళన బాట పట్టారు.
అందుకు ప్రతిగా బీజేపీ ఎంపీలు సైతం నిరసన చేపట్టారు. దీంతో అధికార, విపక్ష పార్టీల ఎంపీలు హోరాహోరీగా నినాదాలు చేశారు. తర్వాత పార్లమెంట్ లోకి ప్రవేశించేం దుకు రాహుల్ గాంధీ ప్రయత్నించారు. అయితే ఆయనను బీజేపీ ఎంపీలు లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. తాను ఎంపీనని.. పార్లమెంట్లోకి వెళ్లే హక్కు ఉందంటూ వారికి స్పష్టం చేశారు. ఆ క్రమంలో స్వల్ప తొపులాట చోటు చేసుకొంది. దీంతో బీజేపీ ఎంపీ కింద పడిపోయినట్లు సమాచారం. భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి.. ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. అయితే గాయపడిన ఎంపీ యోగ క్షేమాలను ప్రధాని మోదీ అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.