మాజీ మంత్రి అప్పలరాజుపై దువ్వాడ మండిపాటు
కగౌతు కుటుంబంపై ఆరోపణలు సరికాదు కమీడియా సమావేశంలో దువ్వాడ, శశిభూషణ్
అక్షరకిరణం, (పలాస): మాజీ మంత్రి వ్యవహారశైలిపై టీడీపీ నాయకులు విరుచుకుపడ్డారు. బాలికలపై అఘాయిత్యం జరిగితే దోషులెవ్వరినీ విడిచిపెట్టవద్దని ఎమ్మెల్యే శిరీష ఆదేశాలు జారీ చేస్తే మాజీ మంత్రి వక్రభాష్యం చెబుతూ ఆమె సెటిల్మెంట్లకు పాల్పడుతున్నారని ఆరోపించడంపై మండిపడ్డారు. ఈనేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా, పలాసలో వజ్రపుకొత్తూరు పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు దువ్వాడ హేంబాబు చౌదరి, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు బుల్లోజు శశిభూషణ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. తప్పు జరిగితే ఏ పార్టీ వారైనా శిక్ష పడాల్సిందేనని ఎమ్మెల్యే సంకల్పిస్తే సెటిల్మెంట్ చేస్తున్నారని మాజీమంత్రి నోటికొచ్చినట్టు మాట్లాడుతు న్నారని మండిపడ్డారు. అప్పలరాజు అధికారంలో ఉన్నప్పుడు ఎంతోమంది మహిళలపై ఎన్నో అఘాయిత్యాలు చేసి, హత్యలు చేసేసినా పట్టించుకున్న దాఖలాలు లేవని ఎద్దేవా చేశారు. పలు సందర్భాల్లో తన బ్యాక్‌బోన్ అని చెప్పుకొనే ఓ వ్యక్తి నీలిభద్ర గ్రామానికి చెందిన విద్యార్థిని బలవన్మరణాన్ని సెటిల్ చేయలేదా అని ప్రశ్నించారు. చాలా మంది ప్రజాప్రతినిధితో ఫొటోలు దిగుతుంటారని, అదేవిధంగా నిందితుల బంధువులు ఎమ్మెల్యేతో ఫొటోలు దిగితే ఆమె సెటిల్మెంట్ చేశారనడం విడ్డూరంగా ఉందన్నారు. తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుల్లోజు శశిభూషణ్ మాట్లాడుతూ మాజీ మంత్రి అప్పలరాజు శవాలతో రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. సీదిరి అప్పలరాజు ముందు నిజాలు తెలుసుకుని మాట్లాడాలన్నారు.