పోలీసుల ముందే.. మందుబాబుల చేతివాటం
కమందుబాటిళ్లు ఎత్తుకెళ్లిపోయిన వైనం కఆగలేకపోయాం సార్ అంటూ సమాధానం
అక్షర కిరణం, (గుంటూరు): ఏపీలో మందు బాబులు కొందరు ఆగలేకపోయారు. పోలీసులు ధ్వంసం చేసేందుకు సిద్దంగా ఉంచిన మద్యం సీసాలను ఒక్కొకరుగా వచ్చి తీసుకెళ్లిపోయారు. అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నం చేసినా ఆగలేదు.
గుంటూరు జిల్లా వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల సమయంలో పోలీసులు భారీ ఎత్తున మద్యం సీసాలను సీజ్ చేశారు. దాదాపు రూ.50 లక్షల విలువైన 24,031 మద్యం బాటిళ్లను పట్టుకున్నారు. అయితే.. సోమవారం వాటిని ధ్వంసం చేసేందుకు పోలీసులు ఏర్పాట్లు చేశారు. ఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో నల్లచెరువులోని డంపింగ్ యార్డులో మద్యం సీసాలను ధ్వంసం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. సాధారణంగా రోడ్డురోలర్‌తో సీసాలను ధ్వంసం చేస్తుంటారు. అలాంటిది ఈసారి పొక్లెయిన్ తీసుకురావడంతో సీసాలను పగలగొట్టడానికి సమయం పట్టింది. దీన్ని అవకాశంగా తీసుకున్న మందుబాబులు ఒక్కసారిగా గుంపులుగా అక్కడికి చేరుకున్నారు. మద్యం సీసాలను నేలపై పెట్టిన తర్వాత కాసేపటికే గుంపులుగా వచ్చి చేతికందిన మద్యం సీసాలను పట్టుకుని పారిపోయారు. కొందరిని పోలీసులు వద్దు ఆ సీసాలను అక్కడే పెట్టాలని చెప్పినా వినలేదు. మద్యం సీసాలను ధ్వంసం చేస్తారా.. ప్రాణం పోతున్నంత పనైందంటూ సీసాలను పట్టుకెళ్లారు. ఆగలేకపోయాం సార్ అంటూ పలువురు చెప్పుకొచ్చారు. ఆ తర్వాత మిగిలిన వాటిని పోలీసులు ప్రొక్లెయిన్‌తో ధ్వంసం చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుత సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.