బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు స్థలంపై వివాదం
అక్షర కిరణం, (విశాఖపట్నం/హైదరాబాద్): బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు అకాడమీ, స్పోర్ట్స్ స్కూల్ కోసం గత ప్రభుత్వం స్థలం కేటాయించిన స్థలంపై వివాదం చెలరేగుతోంది. పీవీ సింధుకు ఇచ్చిన స్థలంలో జూనియర్ కాలేజ్‌ను ఏర్పాటు చేయాలంటూ అక్కడి స్థానికులు పట్టుబడుతున్నారు. విశాఖపట్నంలో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీసీ సింధు అకాడమీ, స్పోర్ట్స్ స్కూల్‌కు గత వైసీపీ ప్రభుత్వం స్థలం కేటాయించిన విషయం తెలిసిందే. విశాఖపట్నం జిల్లా తోటగురువులో స్థలాన్ని అకాడమీకి కేటాయిస్తూ వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఆ స్థలంపై ప్రస్తుతం స్థానికులు ఆందోళనకు దిగారు. ఆ స్థలంలో జూనియర్ కాలేజ్ నిర్మించాలంటూ వారు నిరసనకు దిగారు. జూనియర్ కాలేజ్ కేటాయించా లంటూ ప్రభుత్వాన్ని ఇప్పటికే పలుమార్లు స్థానికులు కోరారు. ఖచ్చితంగా ఆ స్థలాన్ని జూనియర్ కాలేజ్‌కు కేటాయించాలని స్థానికులు పట్టుబడుతున్నారు. మరి ఈ వ్యవహారంపై ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం, ఇటు బ్మాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ఎలా స్పందిస్తారో చూడాలి మరి. 2021, జూన్‌లో అప్పటి జగన్ ప్రభుత్వం పీవీ సింధుకు విశాఖలో రెండు ఎకరాలు స్థలం కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. విశాఖలో బ్యాడ్మింటన్ అకాడమీ, స్ప్రోట్స్ స్కూల్ ఏర్పాటు చేసేందుకు పీవీ సింధుకు ప్రభుత్వం భూమిని కేటాయించింది. విశాఖ రూరల్ మండలం చినగదిలి మండలంలో 73/11,83/5, 6 సర్వే నంబర్లలో పశుసంవర్థక శాఖకు చెందిన మూడు ఎకరాల స్థలంలో రెండు ఎకరాలను క్రీడలు, యువజన వ్యవహారాల శాఖకు.. ఒక ఎకరాన్ని వైద్య ఆరోగ్యశాఖకు బదలాయిస్తూ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు కూడా జారీ చేశారు. క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ ఆ రెండు ఎకరాలను పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీ కోసం కేటాయించింది. అకాడమీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, మూడేళ్ల కాలానికి ఐటీ రిటర్నులు సమర్పించడమే కాకుండా నిబంధనల ప్రకారం మిగతా షరతులన్నీ పూర్తి చేశాక ఆ భూమిని పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి బదలాయించాలని కూడా నిర్ణయించారు. అకాడమీ అవసరాల కోసమే ఆ భూమిని వినియోగించాలని, కమర్షియల్ అవసరాల కోసం వినియోగించకూడదని ఉత్తర్వుల్లో అప్పటి సర్కార్ స్పష్టంగా పేర్కొంది. అయితే ఆ స్థలంలో జూనియర్ కాలేజ్ నిర్మించాలంటూ స్థానికులు ఆందోళన చేస్తున్నారు.