జాతీయ క్రీడా పోటీల్లో కాంస్య పతకం సాధించిన అడ్డా తోషినికి అభినందన
అక్షర కిరణం, (విజయనగరం): సాధారణ విద్యార్థు లతో పాటు ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు సమాన అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో విద్యాశాఖ ప్రత్యేక విద్యకు అధిక ప్రధాన్యం ఇస్తోందని జిల్లా విద్యాశాఖ అధికారి యు. మాణిక్యం నాయుడు, సమగ్ర శిక్ష అదనపు పదక సమన్వయకర్త డాక్టర్ ఏ.రామారావు అన్నారు. ఇటీవల చత్తీష్ గడ్ రాష్ట్రంలోని బిలాషపూర్ లో మేథో వైకల్యం గల ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు జాతీయస్థాయి స్పెషల్ ఒలింపిక్ గేమ్స్ నిర్వహించారు. ఈ జాతీయస్థాయి పోటీల లో రాష్ట్రం తరఫున జిల్లాలోని తెర్లాం ఉన్నత పాఠశాలకు చెందిన అడ్డా తోషిని బోసి బాల్ ఆటలో పాల్గొంది. వ్యక్తిగత విభాగంలో పోటీపడిన తోషిని మంచి ప్రతిభ కనబరిచి కాంస్య పతకాన్ని సాధించింది. ఈ సందర్భంగా గురువారం విద్యాశాఖ, సమగ్ర శిక్షా ఉన్నతాధికార్లు తోషినిని తమ కార్యాలయంలో అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి విద్యాశాఖ ఎంతో ప్రధాన్యత ఇస్తోందన్నారు. ఈ విద్యార్థినికి కోచ్లు వ్యవహరించిన పి. సునీల్, ఎన్.బంగారునాయుడులను కూడా అధికార్లు అభినందించారు. ఈకార్యక్రమంలో జిల్లా సహిత విద్య సమన్వయకర్త ఎస్.సూర్యారావు, సహా సమన్వయకర్త ఎమ్. భారతి, తెర్లాం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్.ఎస్.ఎం.రమేష్, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.