8న జామి ఎల్లమ్మ జాతరకు ఏర్పాట్లు పూర్తి
అక్షరకిరణం, (పలాస): జామి ఎల్లమ్మ జాతర ఈనెల 8న నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎల్లమ్మ వీధిలో వెలిసిన ఆలయంలో ప్రతి ఏట శివరాత్రి దాటిన తొమ్మిదవ రోజున ఈ జాతర నిర్వహిస్తారు. మన రాష్ట్రంతోపాటు ఒడిసా, ఛత్తీస్గడ్ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఎల్లమ్మను దర్శించుకుని పడి సమర్పిస్తారు. చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్న అమ్మవారిని దర్శించుకుంటే దూరమవుతాయన్నది భక్తుల నమ్మకం. జాతరకు ముందు రోజు ఆవాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. జాతరకు రెండు రోజుల ముందునుంచి కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. తొలి రోజు అమ్మవారి పోతురాజుని తయారు చేసి జంగిడితో జమీందారీ వంశస్థుల వద్దకు వెళ్లి అక్కడ అగ్నిగుండం తొక్కుతారు. వారు ఇచ్చిన పడ (జోగి)ని తీసుకుని, అక్కడ నుండి పలాస కాశీబుగ్గ వీధుల లో తిరిగి, అమ్మవారి పూజకు సమర్పిస్తారు. ఈ కార్యక్రమం అంతటినీ ఆలయ నిర్వహకులు, కొల్లకోట వంశస్థులు నిర్వహిస్తారు. తర్లాకోటలో ఉన్న జమీందారి వంశస్థులు ఆలయానికి వెళ్లి సింధూర పంట (సింధూరం తీయడం) నిర్వహించడంతో శనివారం జాతర ప్రారంభమవుతుంది. జమీందారీ వంశస్థులు తొలి పూజ చేసి తర్వాత భక్తులకు దర్శనం కల్పిస్తారు. అమ్మవారికి పడి (బియ్యం, పసుపు, వేపాకులు) కట్టి ఆలయ శిఖరంపై వేయడం ఆచారంగా వస్తోంది. కాగా భక్తులకు శనివారం వేకువజాము 4 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు దర్శనం కల్పిస్తున్నట్టు ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా ఎల్లమ్మ గుడిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. భక్తుల రద్దీకనుగుణంగా క్యూలైన్లు ఏర్పాటు చేసి తోపులాటలు లేకుండా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు.