అహ్మాదాబాద్‌లో కూలిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787
విమానంలో గుజరాత్ మాజీ సీఎం సహా
242 మంది ప్రయాణికులు
అహ్మాదాబాద్ నుంచి లండన్‌కు ప్రయాణం
విమానంలో సిబ్బందితో సహా 254 మంది
టేకాఫ్ అయిన కాసేపటికే కూలిన విమానం
అక్షర కిరణం, (అహ్మాదాబాద్/జాతీయం): ఎయిర్ ఇండియాకు చెందిన విమానం ప్రమాదానికి గురైంది. గుజరాత్‌లోని అహ్మాదాబాద్‌లో విమానం కూలిపోయింది. గురువారం మధ్యాహ్నం టెకాఫ్ అయిన కొద్దిసేపటికే మేఘాని వద్ద షాహీబాగ్ హోటల్ సమీపంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 12 ఫైర్ ఇంజిన్లతో ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపుచేస్తున్నారు. టెకాఫ్ సమయంలోనే కూలిపోయినట్టు అధికారులు తెలిపారు. ఎయిరిండియాకు చెందిన బోయింగ్ 787 (ఏఐ 171) విమానం అహ్మదాబాద్ నుంచి 242 మంది ప్రయాణికులతో లండన్‌కు బయలుదేరింది. విమానాశ్రయం నుంచి టెకాఫ్ అయిన 2 నిమిషాలకే కూలిపోయింది. విమానం 845 అడుగుల ఎత్తులో ఉండగా తొలుత అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన తర్వాత జనావాసాలపై పడిరది. సరిగ్గా మధ్యాహ్నం 1.17 గంటలకు విమానం టేకాఫ్ అయ్యింది. విమానంలో మొత్తం 254 మంది ఉండగా.. వీరిలో 242 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది. వీరిలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, బీజేసీ సీనియర్ నేత విజయ్ రూపానీ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదం కారణంగా భారీగా ఎగిసిపడుతోన్న మంటలను ఫైర్ ఇంజిన్ల సాయంతో అదుపుచేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రదేశానికి సమీపంలోని అన్ని రహదారులను అదికారులు మూసివేశారు. పదుల సంఖ్యలో అంబులెన్స్‌లు అక్కడకు చేరుకున్నాయి. ప్రమాదంలో ప్రయాణికులు ఎంతమంది గాయపడ్డారు? అనేది ఇంకా తెలియరాలేదు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మంటలు భారీ ఎత్తున ఎగిసిపడు తున్నాయి. క్షతగాత్రులను అంబులెన్స్‌ల్లో ఆసుపత్రులకు తరలిస్తున్న దృశ్యాలకు సంబంధించిన వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు.. అహ్మదాబాద్‌కు హుటాహుటిన బయలుదేరారు. ప్రాణనష్టం భారీగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఎక్కువ దూరం కావడంతో విమానంలో భారీగా ఇంధనం నింపడంతో, ప్రమాదం తర్వాత సంభవించిన పేలుడు, మంటలు తీవ్రత ఎక్కువగా ఉంది. అయితే, ప్రమాదంలో మరణాలు లేదా క్షతగాత్రులపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ప్రమాద కారణాలపై దర్యాప్తునకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అధికారికంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. బోయింగ్ కంపెనీ నుంచి కూడా సాంకేతిక బృందం వచ్చే అవకాశం ఉంది.
ప్రమాదానికి గల అనుమానిత కారణాలు అధికారులు ప్రకటించలేదు. కానీ, అంతర్జాతీయ ప్రయాణం కోసం అధికంగా ఇంధనం నింపడం వల్ల ప్రమాదం అనంతరం మంటలు మరింత విస్తరించి, సహాయక చర్యలకు అడ్డంకిగా మారిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ ఘటనపై గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, హోం మంత్రి హర్ష సంగవీ, అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్లతో మాట్లాడారు. ఈ ప్రమాదానికి సంబంధించి రాష్ట్రానికి అవసరమైన సహాయాన్ని కేంద్రం అందిస్తుందని హామీ ఇచ్చారు. ప్రమాదంపై ప్రకటన విడుదల చేసిన ఎయిరిండియా బోయింగ్ 787, ఏఐ 171 అహ్మదాబాద్-లండన్ గ్యాట్విక్ మార్గంలో ప్రయాణిస్తుండగా ప్రమాదంలో చిక్కుకుంది. ప్రస్తుతం, వివరాలు సేకరిస్తున్నాం’ అని పేర్కొంది.