పార్లమెంట్లో ‘సంచార్ సాథీ’పై తీవ్ర దుమారం
కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన
అక్షర కిరణం, (ఢల్లీి/జాతీయం): ‘సంచార్ సాథీ ’ అంశం పార్లమెంట్‌ను కుదిపేస్తోంది. భారత్‌లో విక్రయించే అన్ని కొత్త స్మార్ట్ఫోన్లలో సంచార్ సాథీ యాప్‌ను ప్రీ-ఇన్స్టాల్ చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఇది రాజ్యాంగం కల్పించిన వ్యక్తిగత గోప్యత హక్కును ఉల్లంఘిం చడమేని ఆరోపిస్తున్నాయి. దీనిపై పార్లమెంట్లో మంగళ వారం తీవ్ర చర్చ జరిగింది. ప్రతిపక్ష ఇండియా కూటమి పార్టీలు సభా కార్యక్రమాలను అడ్డుకోవడంతో సభలో తీవ్ర గందరగోళం నెలకుంది. ఈ అంశంపై వాయిదా తీర్మానం పెట్టిన కాంగ్రెస్.. సంచార్ సాథీపై విస్తృత చర్చ జరపాలని డిమాండ్ చేసింది.
ఫోన్ యూజర్ల కదలికలు, సందేశాలు, కాల్స్‌పై నిఘా పెడుతుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఇదొక డిస్టోపియన్ టూల్ అని దుయ్యబట్టారు. ప్రతి భారతీయుడిపైనా నిఘా పెట్టడమే కాకుండా వారి ఆర్థిక హక్కులపై దాడిగా వేణుగోపాల్ అభివర్ణించారు. దీని అమలు రాజ్యాంగ విరుద్ధమని ఆయన విమర్శించారు. ఈ అంశంపై రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ రేణుక చౌదరి వాయిదా తీర్మానం ఇచ్చారు. ఇది దారుణమైన పరిణామని, భవిష్యత్తుల్లో నియంతతృత్వానికి దారితీస్తుందని శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ధ్వజమెత్తారు. ప్రజల గోప్యతను హరిస్తుందని దుయ్య బట్టారు. టీఎంసీ ఎంపీ సాగరిక ఘోష్ కూడా తీవ్రస్థాయి లో విమర్శలు గుప్పించారు.
ఈ నేపథ్యంలో కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పష్టతనిచ్చారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అవసరం లేదనుకుంటే యూజర్లు సంచార్ సాథీ యాప్‌ను తొలగించుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ‘దాన్ని యాక్టివేట్ చేయకండి (సంచార్ సాథీ). యాప్‌ను మీ ఫోన్లో ఉంచడం.. తొలగించడం అంతా మీ ఇష్టం. ఉదాహరణకు మీరు ఫోన్ కొన్నప్పుడు, చాలా యాప్‌లు ముందే ఇన్స్టాల్ అయి ఉంటాయి.. గూగుల్ మ్యాప్స్ కూడా వస్తుంది.. గూగుల్ మ్యాప్స్‌ను వాడకూడదు అనుకుంటే దాన్ని తొలగించుకోవచ్చు’ అని అన్నారు.
ఆండ్రాయిడ్ ఫోన్ల నుంచి గూగుల్ మ్యాప్‌లను డిలీట్ చేయడం సాధ్యం కాదు. కానీ, దాన్ని డిసేబుల్ చేయవచ్చు. ఐఫోన్లలో మాత్రం గూగుల్ మ్యాప్స్‌ను పూర్తిగా డిలీట్ చేయొచ్చు. మంత్రి మాత్రం సంచార్ సాథీకి సంబంధించిన అపోహలను తొలగించడానికి తాను ప్రయత్నిస్తున్నానని చెప్పారు. ‘‘ఇది వినియోగదారుల భద్రతకు సంబంధించిన అంశం. ఇందులో ఏది తప్పనిసరి కాదు. ఇష్టం లేకుంటే మీరు రిజిస్టర్ చేసుకోవద్దు.. అది అలా డార్మెంట్‌గా ఉంటుంది. మీకు డిలీట్ చేయాలనిపిస్తే, డిలీట్ చేయండి. కానీ దేశంలోని ప్రతి వ్యక్తికి మోసాల నుంచి తమను రక్షించడానికి ఒక యాప్ ఉందని తెలియదు. అందుకే ఈ సమాచారాన్ని విస్తృతంగా తెలియజేయడం మా బాధ్యత’ అని ఆయన కేంద్రం మార్గదర్శకాలపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.