22 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు
కభోజనాల్లో వివక్షపై స్పీకర్ ఆగ్రహం
అక్షర కిరణం, (అమరావతి): ఏపీ అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై ఇవాళ బీఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి స్పీకర్ అయ్యన్నపాత్రుడు, సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, బీజేపీ పక్ష నేత విష్ణు కుమార్ రాజు హాజరయ్యారు.
ఈ భేటీలో అసెంబ్లీ సమావేశాల్ని 22 వరకూ నిర్వహించా లని నిర్ణయించారు. జగన్ అసెంబ్లీకి రాకపోతే చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పీకర్ అయ్యన్న వ్యాఖ్యానిం చారు. అసెంబ్లీ సమావేశాలు మాత్రం సీరియస్‌గా జరగా లన్నారు. రేపు బడ్జెట్‌పై అసెంబ్లీ కమిటీ హాల్లో ఎమ్మెల్యే లందరికీ శిక్షణ తరగతులు ఉంటాయని, శనివారం కూడా సభ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు స్పీకర్ తెలిపారు. బిల్లులు, చర్చలకు అనుగుణంగా కొన్ని రోజులు రెండు పూటలా అసెంబ్లీ ఉంటుందన్నారు. 8 బిల్లులతో పాటు ప్రభుత్వ పాలసీలకు ఆమోదం తెలపాలని నిర్ణయించారు. ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవని జగన్ ను ఉద్దేశించి సీఎం చంద్రబాబు బీఏసీలో వ్యాఖ్యానించారు.. ప్రజా సమస్యలపై బాధ్యతాయుతమైన చర్చ జరపడం సభ్యుల బాధ్యతని, 1995లో తెల్లవారు జామున 4గంటలకు ముందురోజు రాత్రి భోజనం చేసిన సందర్భాలు ఉన్నాయని చంద్రబాబు తెలిపారు. ఎమ్మెల్యేలు విధిగా అసెంబ్లీకి హాజరై సీరియస్ గా తీసుకోవాలన్నారు. చీఫ్ విప్, విప్‌లను రేపు ఖరారు చేస్తామని తెలిపారు. తాను స్పీకర్‌గా ఉన్న సమయంలో సభలో చంద్రబాబు హుందాతనం చూసానని జనసేన పక్ష నేత నాదెండ్ల మనోహర్ గుర్తుచేసుకున్నారు. మరోవైపు కనీసం 15రోజులైనా అసెంబ్లీ జరగాలని బీజేపీ పక్ష నేత విష్ణు కుమార్ రాజు కోరారు. ప్రజాధనం దుర్వినియోగంతో కట్టిన ఋషికొండపై చర్చ జరగాలన్నారు. ఎమ్మెల్యేలంతా ఓరోజు ఋషికొండ పర్యటన చేపట్టాలని విష్ణుకుమార్ రాజు కోరారు. మరోవైపు ఇవాళ అసెంబ్లీలో సభ్యులకూ, ఇతర సిబ్బందికీ మధ్య పెట్టే భోజనాల్లో వ్యత్యాసం ఉండటంపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యులకు వేరుగా, ఇతరులకు వేరుగా భోజనం పెట్టారా అంటూ నిలదీశారు.
అందరికీ ఒకేలా భోజనం పెట్టామని అధికారులు ఆయనకు తెలిపారు. ఒకేలా భోజనం పెడితే నేనెందుకు నిలదీస్తానని స్పీకర్ అడిగారు. తనకు ఫిర్యాదులు ఎందుకొచ్చాయో సమాధానం చెప్పాలన్నారు. పదార్థాలు ఒక్కటే కానీ అన్నం ఒక్కటే మారిందని అధికారులు వివరణ ఇచ్చారు. దీంతో అసెంబ్లీ అంటే తమాషా అనుకుంటున్నారా అంటూ అధికారులు, కాంట్రాక్టర్ పై స్పీకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.