బీహార్ ఎన్నికల్లో మహా ఘట్ బంధన్ సీఎం అభ్యర్థిగా తేజస్వీ యాదవ్
అక్షర కిరణం, (పట్నా/ జాతీయం): బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ తేదీలు దగ్గరపడుతున్న వేళ.. విపక్ష మహాఘట్బంధన్ కీలకమైన ముఖ్యమంత్రి అభ్యర్థిపై నెల కొన్న సందిగ్ధతకు తెరదించింది. ఓవైపు సీట్ల విషయంలో గొడవ జరుగుతుండగానే.. ముఖ్యమంత్రి, ఉప ముఖ్య మంత్రి అభ్యర్థులను ఖరారు చేసేసింది. కూటమిలో భాగ స్వామ్య పార్టీలన్నీ ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ వైపే మొగ్గు చూపి.. ఆయన నాయకత్వంలో ముందుకు వెళ్లడానికి అంగీకారం తెలిపాయి. దీనికి సంబంధించి సీఎం అభ్యర్థి గురించి గురువారం బీహార్ రాజధాని పాట్నాలో జరిగిన మీడియా సమావేశంలో అధికారిక ప్రకటన చేశారు.
ఈ సందర్భంగా మహాకూటమి ఎన్డీయేను ఉద్దేశిస్తూ.. ‘‘తేజస్వీ యాదవ్ మా కూటమి అభ్యర్థి. మరి మీ అభ్యర్థి ఎవరు?’’ అంటూ సవాల్ విసిరింది. అంతేకాకుండా ముఖ్యమంత్రి అభ్యర్థితో పాటు ఉప ముఖ్యమంత్రి అభ్యర్థిని కూడా విపక్ష కూటమి ప్రకటించడం ఈ సమావేశంలో ముఖ్యంగా గమనించదగ్గ అంశం. వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ) వ్యవస్థాపకుడు ముఖేష్ సహానీ డిప్యూటీ సీఎం అభ్యర్థి అని కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గహ్లోత్ అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ సంయుక్త మీడియా సమావేశం పోస్టర్లలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఫొటో కనిపించకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చ కు దారితీసింది. పోస్టర్లో కేవలం తేజస్వీ యాదవ్ ఫొటో మాత్రమే దర్శనం ఇవ్వడంపై బీజేపీ వ్యంగ్యాస్త్రాలు విసిరింది.
సీఎం అభ్యర్థిపై ఏకాభిప్రాయం కుదిరినప్పటికీ.. సీట్ల పంప కంలో మహాకూటమిలో ఇంకా స్పష్టత రానట్లు తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ 61 స్థానాల్లో పోటీకి దిగింది. ఆర్జేడీ 143 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. మరోవైపు సీపీఐ 9 స్థానాల్లో, సీపీఐ (ఎం) 4 స్థానాల్లో బరిలోకి దిగాయి.
అయితే ప్రకటించిన జాబితాలో ఎనిమిది స్థానాల్లో కాంగ్రెస్, ఆర్జేడీ, వామపక్ష పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. దీంతో ఆయా స్థానాల్లో కూటమి అభ్యర్థుల మధ్యే నేరుగా పోటీ నెలకొంది. ఈపరిణామం మహాకూటమిలో చీలిక వచ్చిందనే వదంతులకు బలాన్ని చేకూర్చింది. అయితే ఈ పోటీని కూటమి నాయకత్వం స్నేహపూర్వక పోటీగా రిగణి స్తుందా, లేదా చివరి నిమిషంలో సయోధ్య కుదుర్చుకుని ఉమ్మడి అభ్యర్థులను ప్రకటిస్తారా అనేది బిహార్ ఎన్నికల ప్రచారంలో ఆసక్తికరంగా మారింది.