ఇంజినీరింగ్ కాలేజీలో విద్యార్థినిపై క్లాస్మేట్ అత్యాచారం
కమెన్స్ టాయిలెట్లోకి లాక్కెళ్లి అఘాయిత్యం
అక్షర కిరణం, (బెంగళూరు/జాతీయం): ఇంజినీరింగ్ కాలేజీలోనే ఓ విద్యార్థినిపై తోటి విద్యార్థి అత్యాచారానికి పాల్పడ్డాడు. దిగ్భ్రాంతికర ఈ ఘటన దేశ ఐటీ రాజధాని బెంగళూరులో చోటుచేసుకుంది. దక్షిణ బెంగళూరులోని ఓ ప్రయివేట్ ఇంజినీరింగ్ కాలేజీలో అక్టోబరు 10న జరిగిన ఈ అత్యాచార ఘటన బాధితురాలు ఫిర్యాదుతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై అత్యాచారం కేసు నమోదుచేసిన పోలీసులు.. నిందితుడు 21 ఏళ్ల జీవన్ గౌడను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతడు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. నిందితుడు జీవన్ గౌడ ఆరో సెమిస్టర్ విద్యార్థి కాగా.. బాధితురాలు ఏడో సెమిస్టర్ చదువుతోంది. ఇద్దరూ ఒకే బ్యాచ్‌కు చెందిన విద్యార్థులే అయినా బ్యాక్‌లాగ్స్ కారణంగా అతడు ఆరో సెమిస్టర్‌లోనే కొనసాగుతున్నాయి.
ఎఫ్ఐఆర్ ప్రకారం.. నిందితుడు, బాధితురాలికి ఒకరికొకరు పరిచయం ఉంది. సంఘటన జరిగిన రోజు అక్టోబరు 10న బాధితురాలు తనకు సంబంధించిన కొన్ని వస్తువులు తీసుకోడానికి జీవన్ గౌడను కలిసింది. తర్వాత కొద్ది గంటల తర్వాత లంచ్ బ్రేక్‌లో బాధితురాలికి పలుసార్లు ఫోన్ చేసి, ఏడో అంతస్తులో ఉన్న ఆర్కిటెక్చర్ బ్లాక్‌కు రమ్మని చెప్పాడు. దీంతో అక్కడకు వెళ్లిన ఆమెను బలవంతంగా ముద్దుపెట్టుకోబోయాడు. ఆమె లిఫ్ట్ ఉపయోగించి వెళ్లడానికి ప్రయత్నించగా.. ఆరో అంతస్తు వరకు అనుసరించి, పురుషుల వాష్‌రూమ్‌లోకి లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు.
వాష్‌రూమ్ తలుపు గడియపెట్టి ఆ సమయంలో ఆమె ఫోన్ రింగ్ అవుతుంటే స్విచ్ఛాఫ్ చేశాడని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఈ సంఘటన మధ్యాహ్నం 1:30 నుంచి 1:50 గంటల మధ్య జరిగిందని భావిస్తున్నారు. అత్యాచారం గురించి బాధితురాలు తన ఇద్దరు స్నేహితు లకు చెప్పి, కన్నీటిపర్యంతమైంది. అయితే, నిందితుడు గౌడ తరువాత ఆమెకు ఫోన్ చేసి ‘నీకు గర్బనిరోధక మాత్రలు కావాలా?’ అని అడిగినట్టు కూడా ఎఫ్ఐఆర్లో తెలిపారు.
తనపై జరిగిన దాడితో భయపడిపోయిన బాధితురాలు ఫిర్యాదు చేయడానికి మొదట్లో సంకోచించిందని పోలీసులు పేర్కొన్నారు. తర్వాత విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో కుమార్తెను వెంటబెట్టుకుని వెళ్లి హనుమంత నగర్ పోలీస్ స్టేషన్లో అక్టోబరు 15న ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలిలో గురువారం పోలీసులు సీన్ రిక్రియేషన్ చేపట్టారు. అత్యాచారం జరిగిన ఏడో అంతస్తులో ఎటు వంటి సీసీటీవీ కెమెరాలు లేవని, ఆధారాలు సేకరించడం కష్టంగా మారిందని పోలీస్ అధికారులు తెలిపారు. ఫోరెన్సిక్, డిజిటల్ ఆధారాల కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఈ ఘటనపై కర్ణాటకలో రాజకీయ దుమారం రేపుతోంది. ప్రతిపక్ష బీజేపీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలోని మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, శాంతిభద్రతలు క్షీణించాయని ఆరోపించింది. కేవలం నాలుగు నెలల్లోనే మహిళలపై 979 అత్యాచార ఘటనలు జరిగాయని, ఒక్క బెంగళూరులోనే 114 సంఘటనలు చోటుచేసుకున్నాయని ప్రతిపక్ష నేత ఆర్ అశోక ఆరోపించారు.