వైఎస్ జగన్‌కు ప్రతిపక్ష హోదాపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక ప్రకటన
జగన్ రాసిన లేఖను ప్రస్తావించిన స్పీకర్
హైకోర్టు నోటీసులిచ్చిందంటూ జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ వ్యాఖ్య
ఈసారికి క్షమిస్తున్నానని చెప్పిన అయ్యన్న
అక్షర కిరణం, (అమరావతి): ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు వైఎస్ జగన్‌కు ప్రతిపక్ష హోదా అంశంపై కీలకప్రకటన చేశారు. ప్రతిపక్ష హోదాపై వైఎస్ జగన్ హైకోర్టుకు వెళ్లారని.. ప్రతిపక్ష నాయ కుడిలా ప్రకటించేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారని తెలిపారు. జగన్ పిటిషన్ తీసుకోవాలా వద్దా అనే దశలో ఉందని.. ఏమీ తేలకముందే ప్రతిపక్ష హోదాపై జగన్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారన్నారు. హైకోర్టు స్పీకర్‌కు నోటీసులు ఇచ్చినట్లు తప్పుడు ప్రచారం జరిగిందని.. ఇవన్నీ తెలిసి కూడా జగన్‌ను క్షమించి వదిలేస్తున్నాను అన్నారు.
తనకు అభియోగాలు, బెదిరింపులతో జగన్ గతేడాది జూన్‌లో లేఖ రాసినట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ జగన్ బెదిరించారని, ఒకవే ళ ఆయన కావాలనుకుంటే కోర్టుకు వెళ్లొచ్చని సూచించా రు. సభలో పది శాతం సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా ఇస్తా మన్న విషయాన్ని జగన్ గమనించాలన్నారు. లోక్ సభలో టీడీపీ నేత ఉపేంద్రకు ప్రతిపక్ష హోదా అప్పట్లో ఇవ్వలేదని.. అది వాస్తవం కాదన్నారు. ఉపేంద్రను కేవలం టీడీపీ గ్రూప్ కు మాత్రమే నాయకుడిగా ప్రకటించారన్నారు. పద్దెనిమిది సీట్లు లేకుండా తాను చేసి చంద్రబాబుకు ప్రతి పక్ష హోదా లేకుండా చేయగలగనని జగన్ వ్యాఖ్యలు చేశారన్నారు. ఈమేరకు స్పీకర్ ప్రకటనను విడుదల చేశారు.
‘ఈ 16వ శాసన సభలో సభ్యులైన వైఎస్ జగన్మోహన రెడ్డి 24. 6.2024 తేదీన నాకు ఒక లేఖ రాశారు. ఆ లేఖ అంతా అభియోగాలు. ప్రేలాపనలు. బెదిరింపుల మయం. దానికి తోడు, తనకు ప్రతిపక్ష నాయకుడి హోదాకు అర్హత ఉందంటూ అసంబద్ధ వాదనలు. కానీ ఆ లేఖలో ఎలాంటి ప్రత్యేక అభ్యర్థన లేదన్న విషయం గమనించాలి. ఆ లేఖ రాసిన కొద్దిరోజుల తరువాత వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ హై కోర్టుని ఆశ్రయించారు. అంటూ పేర్కొన్నారు.
‘వైఎస్ జగన్ పిటిషన్, ఇంకా విచారణకు అర్హత కలిగి ఉన్నదో, లేదో అని నిర్ధారించే దశలోనే ఉంది. ఆ పిటిషన్లో వై.యస్. జగన్మోహన రెడ్డి, స్పీకర్ ను, శాసన వ్యవహారాల మంత్రిని ప్రతివాదులుగా చేర్చినప్పటికీ. ఆ ఇద్దరినీ మినహాయించాలని గౌరవ అడ్వకేట్ జనరల్ చేసిన సూచనతో కోర్టు ఏకీభవించింది. ఈ న్యాయ ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చే వరకు వేచి చూద్దాం అనుకున్నాను. కానీ ఇటీవలి కాలంలో ఈ అంశంపై వైఎస్ జగన్, ఇంకా వారి పార్టీ నాయకులు చేస్తున్న పలు వ్యాఖ్యలు నా దృష్టికి వచ్చాయి. గౌరవ హైకోర్టు, స్పీకర్‌కు ‘సమన్లు’ జారీ చేసిందని, ‘‘ఉత్తర్వులు జారీ చేయాలని స్పీకర్‌ను ఆదేశించిందని’’ జగన్ చెప్పినట్లు వార్తలు వచ్చాయి. నిజానికి, ఈ నాటి వరకు, హైకోర్టులో జగన్ వేసిన పిటిషన్‌కు విచారణకు అర్హత ఉందో, లేదో ఇంకా నిర్ధారణే కాలేదు’ అని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు.