ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమెల్సీగా గాదే శ్రీనివాసులు గెలుపు
నాలుగు సార్లు పోటీ..
మూడు సార్లు విజయం
అక్షర కిరణం, (విశాఖపట్నం): ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పీఆర్టీయూ అభ్యర్థిగా పోటీ చేసిన గాదె శ్రీనివాసులు నాయుడు విజయం సాధించారు. ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం ఆయనకు ఇది మూడోసారి. గాదె శ్రీనివాసులు నాయుడు విజయనగరం జిల్లా బాబా మెట్టకు చెందిన వారు. 1996లో చాకలిపేట పాఠశాలలో ఎస్జీటీగా ఉద్యోగంలో చేరారు. పదేళ్ల సర్వీసు అనంతరం 2006లో ఉద్యోగానికి రాజీనామా చేశారు. 2007లో శాసన మండలిని పునరుద్ధరించిన తరువాత ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పోటీ చేసి గెలుపొందారు. ఆ తరువాత 2013లో రెండోసారి పోటీ చేసి విజయం సాధించారు. అయితే 2019లో పోటీ చేసిన ఆయన అనూహ్యంగా ఓటమి చెందారు. అయితే ఆయన తాజాగా జరిగిన ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో దిగి మూడోసారి గెలుపొందారు. దీంతో మొత్తంగా చూసుకుంటే ఎమ్మెల్సీగా ఆయన నాలుగు సార్లు పోటీ చేయగా అందులో మూడుసార్లు విజయం సాధించారు.
కాగా ఎమ్మెల్సీగా ఎన్నికైన గాదె శ్రీనివాసులునాయుడుకు పీఆర్టీయూ నాయకులు, ఉపాధ్యాయులు పలువురు అభినందనలు తెలియజేశారు.