విశాఖపట్నంలో వెంటనే ఆ నిర్మాణాలను కూల్చేయండి..
ఏపీ హైకోర్టు కీలక తీర్పు
అక్షర కిరణం, (అమరావతి): ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అపార్ట్మెంట్లలో పార్కింగ్ స్థలాలపై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. వాణిజ్య అవసరాలకు పార్కింగ్ స్థలాలను ఉపయోగించకూడదని హైకోర్టు స్పష్టం చేసింది. పార్కింగ్ స్థలాలను ఇతర అవసరాలకు క్రమబద్ధీకరించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. సెల్లార్, స్టిల్ట్ ఫ్లోర్లలో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను కూడా క్రమబద్ధీకరించకూడదని చెప్పింది. పార్కింగ్ స్థలం అపార్ట్మెంట్ యజమానులు, నివాసితుల ఉమ్మడి ఆస్తిగా వ్యాఖ్యానించింది. ఇతర అవసరాల కోసం ఉపయోగించకూడదని అభిప్రాయ పడిరది. ఈవిషయాన్ని ఏపీ అపార్ట్మెంట్స్ చట్టంలోని సెక్షన్-9 స్పష్టం చేస్తోందని హైకోర్టు ప్రస్తావించింది.
విశాఖపట్నం ఈస్ట్ పాయింట్ కాలనీలోని మాధురి మనోర్ అపార్ట్మెంట్ ఉంది. అయితే జీవీఎంసీ అధికారులు అక్కడ స్టిల్ట్ ఫ్లోర్లో అక్రమంగా నిర్మించిన షాపుల్ని కూల్చివేయాలని నోటీసులు జారీ చేశారు. జీవీఎంసీ ఈ నోటీసుల్ని పలు వురు సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రియించారు. తమ ఆరు షాపులు సెల్లార్/స్టిల్ట్ ఫ్లోర్లో ఉన్నాయని.. వాటికి తాము యజమానులమని పిటిషన్లో పేర్కొన్నారు. ఆ షాపులను క్రమబద్ధీకరించుకోవచ్చని ఏపీ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం సెక్షన్ 455ఏ ప్రకారం కోర్టుకు వివరించారు. షాపులు క్రమ బద్ధీకరించుకోవడానికి దరఖాస్తు అధికారుల పరిశీలనలో ఉందన్నారు. కోర్టు మాత్రం వారి పిటిషన్‌ను కొట్టివేసింది.
స్టిల్ట్ ఫ్లోర్లో షాపులు ఉన్నాయి.. 26 ఏళ్లుగా తమ ఆదీనంలో ఉన్నాయంటూ క్రమబద్ధీకరించాలని కోరడం సరికాదని హైకోర్టు తెలిపింది. ఇది చట్టబద్ధం కాదని.. జీవో 225 కూడా అనుమతించదన్నారు. సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన తీర్పు కూడా ప్రస్తావించారు. పార్కింగ్ ప్రాంతం అపార్ట్మెంట్ వాసుల అవసరాలకే ఉపయోగించాలని.. వాణిజ్య కార్యకలాపాలకు అమ్ముకోకూదని సుప్రీం కోర్టు స్పష్టంగా చెప్పిందని గుర్తు చేశారు. ఈ కేసులో అనధికార షాపుల్ని కూల్చివేయాలని హైకోర్టు అధికారుల్ని ఆదేశించింది. నాలుగు వారాల్లోగా ఆ ప్రాంతాన్ని పార్కింగ్‌కు వీలుగా మార్చేలా అప్పగించాలని ఆదేశించారు జస్టిస్ హరినాథ్. పిటిషనర్లు సమర్పించిన శాంక్షన్డ్ ప్లాన్ నిజమైనది కాదని, వ్యాజ్యం దాఖలు చేసేందుకు అనువుగా దానిని తయారు చేశారని జీవీఎంసీ తరఫు లాయర్ కోర్టుకు తెలిపారు. ఫ్యాబ్రికేట్ చేసిన శాంక్షన్డ్ ప్లాన్‌ను కోర్టుకు సమర్పించారని తప్పుపట్టారు.