ఏరువాక పౌర్ణమిని ప్రారంభించిన కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్
అక్షర కిరణం, (పార్వతీపురం): కర్షకులు వారి కుటుంబాల పండుగ ఏరువాక పౌర్ణమి అని, ప్రకృతిని, భూమిని గౌరవించడం దీని ముఖ్యఉద్దేశ్యమని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ అన్నారు. ప్రతి ఏడాది జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమిని ఏరువాక పౌర్ణమిగా నిర్వహించుకోవడం సంప్రదాయంగా వస్తుందని చెప్పారు. బుధవారం గరుగుబిల్లి మండలం దత్తివలసలో ఏరువాక పౌర్ణమి కార్యక్రమం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. పొలంలో దుక్కి దున్ని ఏరువాక కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. కలెక్టర్ శ్యావమ్ ప్రసాద్ మాట్లాడుతూ వర్ష ఋతువు ఆరంభంలో తొలకరి చినుకు కోసం ప్రార్థిస్తూ వర్షాలు సమృద్ధిగా కురిసి, పంటలు బాగా పండి, దేశం సుభిక్షంగా ఉండాలని రైతులు కోరుకుంటారని తెలిపారు. రైతులు వ్యవసాయ పనులు ప్రారంభించడానికి ముందు భూమిపూజ చేస్తారని, నాగలి, ఎద్దులు ఇతర సేద్యానికి సంబంధిం చిన పనిముట్ల ను పూజిస్తారని కలెక్టర్ తెలిపారు. ఇది వ్యవసాయం, ప్రకృతి మధ్య సంబంధాన్ని గుర్తుచేస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కె.రాబర్ట్ పాల్, ఏడీలు, ఇతర వ్యవసాయ అధికారులు, సచివాలయ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.