ప్రతి పౌరుడికి రూ.2.5 లక్షలతో ఆరోగ్య బీమా
కపేదలకు రూ.25 లక్షల వరకు వైద్యం చేసుకునే అవకాశంకఉత్తరాంధ్ర అభివృద్ధే లక్ష్యం
కవిశాఖలో టీఈఎస్, కాగ్నిజెంట్ గూగుల్ డేటా సెంటర్లు: దత్తి గ్రామం ప్రజా వేదికలో సీఎం చంద్రబాబు
అక్షర కిరణం, (గజపతినగరం/విజయనగరం ప్రతినిది): రాష్ట్రంలోని ప్రతీ పౌరుడికీ ఆరోగ్య బీమా కల్పించేలా రూ.2.5లక్షలతో ఆరోగ్య భద్రత కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విజయనగరం జిల్లా గజపతినగరం నియోజక వర్గం, దత్తి గ్రామం ప్రజావేదికలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ పేదలకు రూ.25 లక్షల వరకూ వైద్యం చేయించుకునే భరోసా ఇస్తున్నాం అన్నారు. విశాఖ నగరానికి టీసీఎస్, కాగ్నిజెంట్, గూగుల్ డేటా సెంటర్ వస్తున్నాయని తెలిపారు. దీనితో ఉత్తరాంధ్ర యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. సెంట్రల్ యూనివర్సిటీకి సమీపంలోనే ట్రైబల్ యూనివర్సిటీ కూడా నిర్మాణమవుతోందని చెప్పారు. అన్నా క్యాంటీన్లను మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తామని చెప్పారు. దీపావళికి ముందే 3 లక్షల గృహప్రవేశాలు చేయిస్తాం అని హామీ ఇచ్చారు. వచ్చే ఏడాది జూన్ లోగా మరో 6 లక్షల ఇళ్లు పూర్తి చేస్తామన్నారు. జీఎస్టీలో ప్రస్తుతం 5, 18 శాతంతో రెండు శ్లాబులే ఉన్నాయని తెలిపారు. ఈ తగ్గింపు వల్ల ప్రభుత్వం రూ.8 వేల కోట్ల ఆదాయం కోల్పోతుందని అయినా ప్రజలకు లబ్ది కలుగుతుందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ సమర్ధ పాలనలో అర్హులందరికీ సంక్షేమం అందిస్తున్నామని చెప్పారు. మేం అందిస్తున్న సంక్షేమం వల్ల దత్తి గ్రామంలో ఒక్కో కుటుంబానికి రూ.2.20 లక్షల లబ్ది కలిగిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం సమర్ధ నిర్వహణ వల్ల ట్రూ డౌన్ చేసి విద్యుత్ చార్జీలను తగ్గిస్తున్నామని, నవంబరు నుంచి ఈ తగ్గింపు అమల్లోకి వస్తుందని తెలిపారు. భవిష్యత్తులోనూ విద్యుత్ ఛార్జీలు పెంచబోమని హామీ ఇచ్చారు. ఇళ్లపైన సోలార్ రూఫ్ టాప్, పొలాల్లో సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. బీసీలకు 3 కిలోవాట్ల వరకూ రూ.98 వేల వరకూ సబ్సీడీ ఇస్తున్నామని, షడ్యూల్డు తరగతుల వారి ఇళ్లకు 2 కిలోవాట్ల వరకూ ఉచితంగానే సోలార్ రూఫ్‌టాప్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఉత్తరాంధ్రలో సాగునీటి ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. రూ.2 వేల కోట్లు ఖర్చు పెట్టి రెండేళ్లలో అన్ని ప్రాజెక్టులూ పూర్తి చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పారు. తారకరామ తీర్ధసాగర్ 25 ఏళ్లు అయినా పూర్తి కాలేదు...మేం దాన్ని పూర్తి చేస్తామని తెలిపారు. భోగాపురం ఎయిర్ పోర్టుతో విజయనగరం ప్రపంచానికి కనెక్ట్ అవుతుందన్నారు. వైజాగ్ రాయపూర్ గ్రీన్ ఫీల్డ్ హైవేతో సెంట్రల్ ఇండియాకు కనెక్టు అవుతామని చెప్పారు. రాజకీయ కక్షతో ట్రైబల్ యూనివర్సిటీ నిర్మాణ ప్రదేశాన్ని గత పాలకులు మార్చేశారని, కానీ నేను ఆ పని చేయబోనని భరోసా ఇచ్చారు. ఈ ట్రైబల్ యూనివర్సిటీకి సమీపంలోనే త్వరలో గ్రేహౌండ్స్ క్యాంపస్ వస్తుందని తెలిపారు. మామూలు కార్యకర్తలను పార్లమెంటు సభ్యులుగా, ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా చేసిన పార్టీ టీడీపీనే అని స్పష్టం చేశారు. 22 ఏళ్ల క్రితం తిరుమలకు వెళ్తుంటే నక్సల్స్ క్రైమోర్ మైన్లు పేల్చారని. ఆ భగవంతుడి దయవల్ల బయటపడ్డానని గుర్తు చేసుకున్నారు. ప్రజలకు సేవలందించేందుకే నా జీవితం అంకితం చేశానని, అన్నదానం, ప్రాణదాన కార్యక్రమాలను టీటీడీ ట్రస్టుతో చేయించాలని కోరానని తెలిపారు. రాష్ట్రం, దేశంలోనూ 5 వేల పైచిలుకు దేవాలయాలను నిర్మించాలని టీటీడీని కోరానని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.