భావితరాలకు స్ఫూర్తి గౌతు లచ్చన్న..
- రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్
అక్షర కిరణం (విజయనగరం):
స్వాతంత్య్ర సమరయోధులు సర్ధార్ గౌతు లచ్చన్న భావితరాలకు స్ఫూర్తి అని, రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్నారై వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కొనియాడారు. ఆయన బడుగు బలహీన వర్గాలకు దిక్సూచి లాంటివారని పేర్కొన్నారు. సర్ధార్ జయంతోత్సవం కలెక్టరేట్లో శనివారం ఘనంగా నిర్వహించారు. ముందుగా లచ్చన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ, నేటి తరానికి సర్ధార్ గౌతు లచ్చన్న లాంటి మహనీయుల జీవిత చరిత్రలు తెలియజెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆయన జీవితం అందరికీ ఆదర్శనీయమని పేర్కొన్నారు. తను నమ్మిన సిద్దాంతం కోసం ఎక్కడా రాజీ పడకుండా జీవితాంతం పోరాటం చేసిన వ్యక్తి అని పేర్కొన్నారు. ప్రజాసమస్యలపై నిరంతరం పోరాడి అందరికీ మార్గదర్శుకులుగా నిలిచారని చెప్పారు. 1978లోనే చట్టసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నారని, పిఏసి ఛైర్మన్గా, మంత్రిగా, ప్రజా నాయకుడిగా విశేష సేవలను అందించారని తెలిపారు. జిల్లాలో గౌతు లచ్చన్న విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాట్లాడుతూ, గౌతు లచ్చన్న గొప్ప సామాజిక కార్యకర్త అని పేర్కొన్నారు.
ఆయన గొప్పతనం భావితరాలకు తెలియజేసేందుకు జన్మదినాన్ని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నామని చెప్పారు. అణగారిన వర్గాలకోసం ఆయన చేసిన సేవలను ఎన్నటికీ మరిచిపోలేమని అన్నారు. ఈ కార్యక్రమంలో
మార్క్ఫెడ్ ఛైర్మన్ కర్రోతు బంగార్రాజు,
తూర్పుకాపు ఛైర్పర్సన్ పాలవలస యశస్వి, జిల్లా బిసి సంక్షేమాధికారిణి జ్యోతిశ్రీ, గౌడ, ఉప కులాల జిల్లా అధ్యక్షులు సిహెచ్ ఆదినారాయణ, రజక సంఘం రాష్ట్ర నాయకురాలు ఇ.విజయలక్ష్మి,జిల్లా రెవెన్యూ అధికారి ఎస్.శ్రీనివాసమూర్తి, విజయనగరం మున్సిపల్ కమిషనర్ నల్లనయ్య, డిఈఓ మాణిక్యంనాయుడు, ఎబిసిడబ్ల్యూఓలు, వసతి గృహ సంక్షేమాధికారులు, ఆ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.