ఆర్మీ జవాన్‌ను స్తంభానికి కట్టేసి.. టోల్ బూత్ సిబ్బంది దాడి..
అక్షర కిరణం, (మీరట్/జాతీయం): ఓ సైనికుడితో ఘర్షణదిగిన టోల్ ప్లాజా సిబ్బంది అతడ్ని స్తంభానికి కట్టేసి అతి దారుణంగా వ్యవహరించారు. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ లో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు స్పందించారు. కేసు నమోదుచేసి నలుగురు టోల్ బూత్ సిబ్బందిని అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన జవాన్ కపిల్ శర్మ ఇండియన్ ఆర్మీ రాజ్‌పుత్ రెజ్మింట్‌లో పనిచేస్తున్నాడు. ప్రస్తుతం శ్రీనగర్‌లో విధులు నిర్వర్తిస్తోన్న అతడు... సెలవులపై స్వస్థలానికి వచ్చాడు. తిరిగి డ్యూటీకి వెళ్లేందుకు ఢల్లీి నుంచి శ్రీనగర్‌కు విమానం టిక్కెట్ బుక్ చేసుకుని.. తన సొంతూరు నుంచి ఆదివారం బయలుదేరాడు. తన బంధువుతో కలిసి కారులో వస్తుండగా భుని టోల్ బూత్ దగ్గరకు వచ్చేసరికి భారీగా వాహనాలు నిలిచిపోయాయి.
ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లడం ఆలస్యమేతే ఫ్లైట్ మిస్సవుతుందని ఆందోళన చెందిన కపిల్.. కారు దిగిన టోల్ బూత్ సిబ్బంది తో మాట్లాడటానికి వెళ్లాడు. మాటమాటా పెరిగి వాగ్వాదం చోటుచేసుకోవడంతో టోల్ బూత్ సిబ్బంది రెచ్చిపోయారు. జవాన్ కపిల్ శర్మ, అతడి కజిన్‌పై ఐదుగురు కర్రలతో దాడిచేశారు. అంతటితో ఆగకుండా స్తంభానికి బిగించి, చేతులు వెనక్కిలాగి పట్టుకుని.. దుర్భాషలాడుతూ విచక్షణా రహితంగా కొట్టి హింసించారు. ఈ మొత్తం తతంగం అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యింది.
ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు.. నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. మీరట్ జిల్లా ఎస్పీ రాకేశ్ కుమార్ మిశ్రా మాట్లాడుతూ.. ఘటనపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ‘ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్న బాధితుడు కపిల్ శర్మ శ్రీనగర్‌లోని తన పోస్ట్‌కు వెళ్తున్నాడు.. ఈక్రమంలో భౌని టోల్ ప్లాజా వద్ద భారీగా వాహనా లు నిలిచిపోయాయి.. విమానం తప్పిపోతుందని ఆందోళన చెందిన అతడు కారు దిగిన టోల్ బూత్ వద్దకు వెళ్లి మాట్లాడాడు. ఈక్రమంలో సిబ్బంది ఘర్షణకు దిగి దాడి చేశారు.. బాధితుడి కుటుంబసభ్యులు ఫిర్యాదు ఆధారంగా సరూర్‌పూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది... సీసీటీవీ ఫుటేజ్, వీడియోలను పరిశీలించిన అనంతర నలుగురు నిందితులను అరెస్ట్ చేశాం.. పరారీలో ఉన్న మిగతావారి కోసం గాలిస్తున్నాం’ అని ఎస్పీ అన్నారు.
మీడియా నివేదికల ప్రకారం.. తన గ్రామానికి టోల్ ఛార్జీల నుంచి మినహాయింపు ఉందని సిబ్బందితో కపిల్ అనడంతో వారి మధ్య వాగ్వాదం ప్రారంభమైంది. ఇది సైనికుడిపై దాడి వరకు దారితీసింది.