రోజుకు 18 గంటలు పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిన ఆర్థిక శిల్పి
పీవీతో కలసి ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం బెదిరింపులు లెక్క చేయక అణు ఒప్పందం
అక్షర కిరణం, (ఢల్లీి/జాతీయం): ఉన్నత విద్యావంతుడు, ప్రముఖ ఆర్థికవేత్త. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న దేశాన్ని గట్టెక్కించి వృద్ధిపథంలో నడిపి ఆర్ధిక సంస్కరణల రూపశిల్పిగా గుర్తింపు పొందిన భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) గురువారం రాత్రి కన్నుమూశారు. దాదాపు 33 ఏళ్ల పాటు పార్లమెంటు సభ్యుడిగా కొనసాగిన మన్మోహన్.. ఆరోగ్యం సహకరించని పరిస్థితుల్లోనూ అత్యంత కీలక సమయాల్లో సభకు హాజరై అందరిలోనూ స్ఫూర్తి నింపారు. దేశ ఆర్థిక రంగానికి మన్మోహన్ వేసిన బలమైన పునాదులు.. ఆయనను ఎన్నటికీ గుర్తు చేస్తూనే ఉంటాయి. ఆర్థిక మంత్రిగా లిబరలైజేషన్, ప్రయివేటైజేషన్, గ్లోబలైజేషన్ (ఎల్పీజీ) సంస్కరణలు ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే దక్కుతుంది.
దివంగత ప్రధాని పీవీ నర్సింహారావు నేతృత్వంలోని ఆర్థిక సంస్కరణలను మన్మోహన్ పట్టాలెక్కించారు. తర్వాత కాలం లో 2004 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీయే ఊహించని విధంగా విజయం సాధించడంతో పగ్గాలను మన్మోహన్‌కు అప్పగించారు. 2004 నుంచి 2014 వరకు ప్రధానిగా కొనసాగారు. రిజర్వ్ బ్యాంకు గవర్నర్‌గా పనిచేసిన మన్మోహన్.. 1991 అక్టోబరు 1 నుంచి 2019 జూన్ 14 వరకు అసోం నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. అనంతరం 2019 ఆగస్టు 20న రాజస్థాన్ నుంచి మళ్లీ రాజ్యసభకు ఎన్నికై ఈ ఏడాది ఏప్రిల్ 3 వరకు కొనసాగారు.
ఆక్స్‌ఫర్డ్‌లో విద్యాభ్యాసం అనంతరం పంజాబ్ విశ్వ విద్యాలయం, ఢల్లీి స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో అధ్యాపకుడిగా పనిచేశారు. 1971లో కేంద్ర వాణిజ్యశాఖ ఆర్థిక సలహా దారుగా నియమితులై.. ఆ తర్వాత ఆర్థిక శాఖకు ప్రధాన సలహాదారు అయ్యారు. ప్రణాళిక సంఘం డిప్యూటీ ఛైర్మన్ గా, ఆర్బీఐ గవర్నర్‌గా, ప్రధాన మంత్రికి సలహాదారుగా, యూజీసీ ఛైర్మన్‌గా బహుముఖమైన సేవలందించారు.
ఇక, పదేళ్ల పాటు ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ రోజూ 18 గంటల పాటు అవిశ్రాంతంగా పనిచేసి... రోజుకు 300 ఫైళ్లను చూస్తూ భారత ఆర్ధిక వ్యవస్థను అత్యంత శక్తిమంత గా తీర్చిదిద్దారు. ఆయన దశాబ్ద పాలనలో అమెరికాతో అణు ఒప్పందం సహా భారత్ పలు చిరస్మరణీయ విజయాలను అందుకుంది. మన్మోహన్ హయాంలోనే వృద్ధిరేటు అత్యధిక స్థాయికి చేరింది. ఇక, 2005లో సమాచార హక్కు చట్టం, 2006లో ఉపాధిహామీ పథకం వంటివి తీసుకొచ్చారు. ఈ పథకంతో పేదలకు ఏడాదికి 100 రోజులు పని కల్పించారు. వెనుకబడిన వర్గాలకు 27శాతం సీట్లు కేటాయించారు.
అమెరికాతో అణు ఒప్పందం విషయంలో యూపీయే-1 ప్రభుత్వానికి లెఫ్ట్ పార్టీలు మద్దతు ఉపసంహరించినా.. రాజకీయంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నా మన్మోహన్ వెనక్కి తగ్గలేదు. ఈ ఒప్పందంతో 1998లో పోఖ్రాన్ అణు పరీక్షల తర్వాత పౌర అణు సౌకర్యాలకు మాత్రమే పరిమితం చేసే ఐఏఈఏ పాక్షిక ఆంక్షలతో సహా భారత్‌పై విధించిన ఆంక్షలు తొలగిపోయాయి. నెహ్రూ నాన్-అలైన్మెంట్ విధానం నుంచి వైదొలగి, అంతర్జాతీయంగా భారత్‌ను అణుశక్తి దేశంగా నిలిపింది.