విశాఖ ఉక్కును రక్షించాలంటూ విద్యార్థి నంఘాల నిరశన దీక్ష
అక్షరకిరణం, (విశాఖపట్నం): విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ కోసం విద్యార్థి సంఘాలు దీక్ష చేపట్టాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం వివిధ విద్యార్థి సంఘాలు మంగళవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరాహార దీక్ష నిర్వహించాయి. ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, ఎస్ఎప్ఐ, డీవైఎఫ్ఏ, పీడీఎస్‌వో సంఘాల ఆధ్వర్యంలో నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ దీక్ష శిబిరంలో ఆయా సంఘాల నాయకులు మాట్లాడారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ విషయం లో కూటమి నాయకులు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులను, ప్రజలను మభ్య పెడుతున్నారని ధ్వజమెత్తారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయనివ్వమని ఒకవైపు చెబుతూనే మరో వైపు ఉద్యోగులను తొలగిస్తున్నారని విమర్శించారు. కూటమి నాయకులు తమ అబద్ధపు మాటలు, హామీలతో ప్రజలను మోసగించే ప్రయత్నాలను మానుకోవాలని ఇప్పటికైనా విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం ప్రజా సంఘాలతో కలసి ఉద్యమించాలని పిలుపునిచ్చారు. తక్షణం విశాఖ ఉక్కు పరిరక్షణపై కూటమి నాయకులు తమ విధానాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు.